![]() |

బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ చుట్టూ గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలకు ఎట్టకేలకు తెరపడింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే యాక్షన్ ఫ్రాంచైజీ ‘ధూమ్ 4’లో రణ్‌బీర్ హీరోగా నటించబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. అయితే, సాం డియాగో కామిక్-కాన్ ఈవెంట్‌లో తన అత్యంత భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న రణ్‌బీర్, ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
తాను ‘ధూమ్ 4’ చిత్రంలో నటించడం లేదని తేల్చిచెప్పడమే కాకుండా, తన భవిష్యత్ ప్రాజెక్టుల జాబితాలో ప్రస్తుతానికి ఆ సినిమా లేనే లేదని ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ వివరణతో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉహాగానాలకు ముగింపు పడింది.
తన రాబోయే సినిమాల గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం తాను పూర్తి స్థాయిలో నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ ప్రాజెక్ట్‌పైనే దృష్టి సారించినట్లు రణ్‌బీర్ తెలిపారు. దాంతో పాటు, దిగ్గజ దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ బిగ్గీ ‘లవ్ అండ్ వార్’ సినిమాలోనూ భాగమైనట్లు తెలిపారు. అలియా భట్, విక్కీ కౌశల్ తో కలసి రణ్‌బీర్ నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ రొమాంటిక్ డ్రామాను 2027 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సమాయత్తమవుతున్నారని ఆయన వెల్లడించారు.
రణ్‌బీర్ మాట్లాడుతూ ‘రామాయణ్ పార్ట్ 2’ పనులు కూడా సమాంతరంగా శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే, ప్రతిష్టాత్మక ‘యానిమల్’ సీక్వెల్ అయిన ‘యానిమల్ పార్క్’ గురించి కానీ, దానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ గురించి కానీ ఆయన ఈ సదస్సులో ఎలాంటి ప్రస్తావనా చేయకపోవడం సినీ అభిమానులను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది.
Ranbir Kapoor, Dhoom 4, Ramayana, Love and War
![]() |